యార్లగడ్డ నాగయ్య....           24-Jun-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 47

ఇంత పెద్ద- 2000 రోజుల పనిలో నాదేముందిలెండి!

 

          అసలీ చల్లపల్లి శ్రమదానమనే దాన్ని- డాక్టరుగారు ఏవంటూ – ఏ వేళప్పుడు మొదలు పెట్టారో గాని అంత పెద్ద ఊరు ఇప్పుడు ఎట్లా మారిపోయిందో చూడండి. ఆరేళ్ల క్రిందటి గ్రామానికీ, ఇప్పటి చల్లపల్లికీ అసలు పోలిక ఉందా? అంత పెద్ద డాక్టర్లకీ, టీచర్లకీ, మంచి హోదాలో ఉన్నవాళ్లకీ, ఇంట్లో పని చేసుకొనే ఆడవాళ్ళకీ, చదువుకొనే పిల్లకాయలకీ  వేరే పనే లేనట్లు- రోజు పొద్దున్నే మైకులు కూడా పెట్టుకొని- ఇట్లా రోడ్లు ఊడ్చే, మురుగు గుంటలు బాగు చేసే కర్మెందుకు పట్టిందా అని మొదట్లో వింతగా చెప్పుకొంటుంటే చాలా సార్లు విన్నాను. పేపర్లలో వేసుకోడానికని కొందరు, జనంలో పలుకుబడి పెంచుకోడానికని కొందరు, అసలుదీనెనక ఏదో పెద్దకతే ఉంటుందని మరికొందరూ మాట్లాడుకొనే వాళ్లు! తరువత్తరువాత పెద్ద పెద్ద నాయకులంతా దీనెనక ఉన్నారని నాకు తెలిసింది. అదేంటో గాని మంత్రులూ, ముఖ్యమంత్రీ, పాటలు పాడే బాల సుబ్రహ్మణ్యం, ఇంకా ఎవరెవరో, ఎక్కడెక్కడి నుండో చల్లపల్లి రావడం, పేపర్ల వాళ్లు అదే పనిగా దీన్ని గురించి వ్రాస్తూ ఉండడం తెలిసి, నాకెంతో ఆశ్చర్యమనిపించింది.  గవర్నమెంటోళ్లక్కూడా ఇదే వరసని అర్థమైంది. ఏది నిజమో- ఏది పుకారో తెలియక పోయినా-“ ఎవరో ఒకళ్లు పూనుకోకపోతే చల్లపల్లేమిటి- ఏ వూరైనా ఇట్లా బాగుపడాలంటే- అది పంచాయతీ తోటి, గవర్నమెంటు తోటే అచ్చంగా జరుగుతుందా?” అని నాకనిపించింది.

 

            మాది శివరామపురం. అంతకు ముందు పాగోలనుకోండి. యార్లగడ్డ నాగేశ్వర రావు – అదే నాగయ్య- అనేది నా పేరు. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూలు చదువు తప్ప పై చదువులు లేవు. పిల్లలు మాత్రం బాగా చదువుకొని ఒకళ్లు హైదరాబాదులో, ఒకరు అమెరికాలో ఉన్నారు. 65 ఏళ్ల వయసులో నాకున్న 4 ఎకరాల వ్యవసాయం కూడ చేయలేక కౌలుకి ఇచ్చాను.

 

            చల్లపల్లి కార్యకర్తలు వాళ్ల ఊరుకాక- మా శివరామపురం మేకల డొంక దగ్గర కూడాఅన్నీ పొద్దున్నే చీకట్లోనే బాగు చేస్తున్నారని తెలిసి ఒకరోజు పదిమంది శివరామపురం వాళ్లం వెళ్లి వాళ్లతో కలిశాం. నేను మాత్రం మొదటి రోజుల్లో అదేదో విచిత్రం చూడడానికి వెళ్లినట్లే వెళ్లాననుకోండి. కొన్నాళ్లు గడిచాక, కొన్ని మీటింగులు కూడ చూశాక, వీళ్లందరితో బాటు ఏవో బహుమతులు అందుకోవడానికి కొన్ని చోట్లకు వెళ్లి వచ్చాక- ఈ గ్రూపులో క్రమ శిక్షణ, కలివిడి, పట్టుదల, ఉన్న ఊరిని బాగు చేసుకొని, శుభ్రంగా బ్రతుకుతూ ఏదో సాధించాలనే తపన నాకు బాగా అర్థమయినవి. స్వార్థం పట్టించుకోక- ఊరి జనం కోసం పాటుబడే వీళ్ల ఆలోచన బాగా నచ్చింది.

 

            నేను ఈ ఉద్యమంలో పాల్గొన్నది తక్కువే. మహా ఐతే 300 రోజులు! కాని వీళ్లందరితో కలిసి చేయగలిగినంత శ్రమదానం చేసిన రోజుల్లో మాత్రం ఇక ఆ రోజంతా అదొక తృప్తి.  మా శివరామపురం రోడ్డునూ, ముఖ్యంగా గ్రామ చెరువునూ అందరం కలిసి ఎంత శ్రద్ధగా- బాగు చేసి, కంచె వేసి, పూల మొక్కలు పెట్టి ముస్తాబు చేశామంటే- ఇక నా జీవితంలో అదెప్పటికీ మర్చిపోలేను.  ఎక్కడెక్కడో - దేశ విదేశాల్లో  ఉంటున్న మాఊరి వాళ్లు పండగలకని ఇక్కడికి వచ్చి మా చెరువును చూసి, జరిగిన విషయం తెలుసుకొని ఎంతగా ఆశ్చర్యపోయారో  తెలుసా? అలాంటి రెండు మార్లు నేను ఈ మిత్రులందరికీ అల్పాహార విందు చేశాను గూడ. అసలు వేకువ నాలుగు గంటల నుండే  పొరుగూరు నుండి వచ్చిన వాళ్లు మాతో కలిసి, మా ఊరును ఇట్లా శుభ్రం చేయడం, ఆరు గంటలకే ఇంత మందిని కలిసి చేసిన గ్రామ పారిశుద్ధ్యాన్ని చర్చించుకొంటూ, శుభకార్యంలో బంధువుల్లాగాకాఫీలు, టిఫిన్లు చేయడం ఎంత అద్భుతంగా ఉన్నదో నేను చెప్పలేను! అన్ని ఊళ్లు కూడా ఇలా కలిసి మెలిసి కృషి చేసుకొని బాగుపడితే ఎంత బాగుంటుందో కదా!

 

- యార్లగడ్డ నాగయ్య

   శివరామపురం – 24.06.2020