ప్రాతూరి శాస్త్రి - 07.10.2020. ....           07-Oct-2020

 *గుంటూరు మహాప్రస్థానము*

వట్టికూటి వెంకట సుబ్బయ్య (గుంటూరు గాంధి) గారి సంస్మరణ సభ

చేతన, హీల్ పాఠశాలల పర్యటన వివరాలు

            గుంటూరు గాంధీ గారి కుటుంబసభ్యులు, మహాప్రస్థాన సేవా సమితి, అవగాహన, గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్, నన్నపనేని పున్నయ్య, లక్ష్మి నరసమ్మ ట్రస్ట్, GIO సంస్థల ఆహ్వానం మేరకు స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు 40 మంది 25-11-2017 శనివారం ఉదయం ఒక బస్సులో బయలుదేరి గుంటూరు వెళ్ళాము.

            మొట్టమొదటగా స్తంబాల గరువులోని మహాప్రస్థానంకు వెళ్ళాము. మహాప్రస్థాన సేవాసమితి అధ్యక్షులు లక్ష్మణరావు గారు, దాసరి హనుమంతరావు గారు, అయ్యన్ రావు గారు, తిరుపతయ్య గారు, మాజీ MLC లక్ష్మణరావు గారు, తాండవ కృష్ణ గారు, దొప్పలపూడి వెంకటేశ్వర్లు గారు వంటి అనేకమంది గుంటూరుకు చెందిన పెద్దలు కార్యకర్తలను సాదరంగా ఆహ్వానించారు. మహాప్రస్థానంను అభివృద్ధి చేసిన తీరును వివరించారు.

            ఈ మహాప్రస్థాన స్ఫూర్తితో గుంటూరు జిల్లాలో అనేక గ్రామాలలో స్మశానాల అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఒక వనంలాగా ఉన్న మహాప్రస్థానాన్ని చూసి కార్యకర్తలందరూ ఎంతో సంతోషించారు. మన ఊళ్ళో కూడా ఇంత బాగా స్మశానాన్ని అభివృద్ధి చేసుకోవాలని అందరికీ అనిపించింది. మన కార్యకర్తలందరికీ మహాప్రస్థానంకి సంబంధించిన పుస్తకాలను అందించారు. అందులో కొత్తగా స్మశానాలను అభివృద్ధి చేసుకునే వారికి నమూనాలను కూడా ఇవ్వడం విశేషం. అనంతరం అక్కడే ఉన్న హాలులో అల్పాహార విందుని ఏర్పాటు చేశారు.

            ఆ తరువాత బృందావన్ గార్డెన్స్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి హాలులో గుంటూరు గాంధీ గారి 16వ సంస్మరణ సభ జరిగింది. గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డా. మన్నే సుబ్బారావు గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

            ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య గారి కుటుంబసభ్యులు స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలందరినీ పేరు పేరునా వేదిక పైకి పిలిచి సత్కరించారు. కార్యకర్తల శ్రమను వారు గుర్తించినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది.

            తిరుపతయ్య గారు ఇచ్చిన  Successful Person, Useful Person ల వివరణ కూడా  బాగా నచ్చింది. Successful Person తనకు, తన కుటుంబానికి మాత్రమే ఉపయోగపడతాడని, Useful Person సమాజానికి ఉపయోగపడతాడని స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలందరూ Useful Persons అని మెచ్చుకున్నారు.

            సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన నాయకుల పిల్లలు చాలామంది తమ తల్లిదండ్రులను అంతగా గౌరవించకపోవడం చూస్తూనే ఉంటాం. కానీ వట్టికూటి వెంకట సుబ్బయ్య గారు మరణించిన 16 సంవత్సరాల తరువాత కూడా వారి సంస్మరణ సభ ఏర్పాటు చెయ్యటమే కాకుండా వెంకట సుబ్బయ్య గారి వలె గ్రామాన్ని శుభ్రం చేస్తున్న చల్లపల్లి కార్యకర్తలను గుర్తించి అభినందించటం వారి కుటుంబసభ్యుల గొప్పతనం, నమ్మిన సిద్ధాంతం ప్రకారం ప్రతిరోజూ తాను నివసిస్తున్న గ్రామంలో ఉదయం పూట కొన్ని గంటల పాటు పారిశుద్ధ్య కార్యక్రమాన్ని, సాయంత్రం పూట సాహిత్య సేవను దాదాపు 55 సంవత్సరాలు నిర్వహించడం వల్లనే నేటికీ వారిని గుంటూరు ప్రజలు గుర్తు పెట్టుకున్నారు.

            ఈ సభలో డా. పద్మావతి గారు మాట్లాడుతూ మనం ఎదిగే క్రమంలో మన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, మిత్రులు, బంధువులతో సహా ఎంతో మంది సహాయం చేస్తేనే మనం ఈ స్థితిలో ఉన్నాము అని గుర్తెరిగి మనం కూడా సమాజాభివృద్ధికి కృషి చేయాలి. ఇది సేవ కాదు, ఇది మన బాధ్యత అని, మహాత్మా గాంధీ గారి జీవితం లాగానే వట్టికూటి వెంకట సుబ్బయ్య గారి జీవితం కూడా ఒక సందేశమేఅని చెప్పారు.

            గుడి నిర్వాహకులు మస్తానయ్య గారు, తిరుపతయ్య గారు, ‘అవగాహనశివరామి రెడ్డి గారు కూడా ఈ సభలో ప్రసంగించారు.

            అనంతరం పెద్దలందరూ భోజనాల ఏర్పాట్లు చేశారు. ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలలో Senior Citizens అందరూ ఇలా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అంతా కలిసి భోజనాలు చెయ్యటం వారి ఆనవాయితీ అట. వడ్డన కూడా వారే చేశారు!

           మధ్యాహ్నం గుంటూరు శివార్లలో అనాధ బాలబాలికల కోసం HEAL సంస్థ నడుపుతున్న స్కూలు, శ్రీమతి మంగాదేవి గారు నడుపుతున్న చేతనస్కూళ్ళను సందర్శించటం జరిగింది. ఎంతో అందంగాను, శుభ్రం గాను, పచ్చదనం తోను, మానవత్వంతోను నడుపబడుతున్న ఈ స్కూళ్ళను చూసి స్వచ్ఛ కార్యకర్తలందరూ ఎంతో సంతోషించారు. మరొక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ గడిపితే బాగుండునని అభిప్రాయపడ్డారు. మంగాదేవి గారితో అంత సమయాన్ని గడపగలగడం మా అదృష్టం. శ్రీమతి మరుద్వతి గారు అక్కడి విషయాలను చక్కగా వివరించారు.

           సాయంత్రం 6-30 గంటలకు వెంకటేశ్వర స్వామి గుడిలోని అన్నమయ్య కళావేదికలో స్వచ్ఛ సుందర చల్లపల్లినిర్వహింపబడుతున్న తీరును Power Point Presentation ద్వారా వివరించటం జరిగింది. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ లక్ష్మణ స్వామి గారు, KS లక్ష్మణ రావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం విశేషం. గౌరవనీయమైన ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసిన గుంటూరు లోని ఎంతోమంది పెద్దలు ఈ కార్యక్రమాన్ని వీక్షించటం, JKC కాలేజీలో నాకు చదువు చెప్పిన కొంతమంది గురువు గార్లు కూడా ఈ కార్యక్రమంలో ఉండటం మా అదృష్టం.

          గత 16 సంవత్సరాల నుండీ ప్రతిరోజూ సాయంత్రం 6-30 నుండి 8-30 వరకు ఏదో ఒక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూ ఉండటం, ప్రాంగణమంతా ఎంతో శుభ్రంగా ఉంచటం ఈ గుడి ప్రత్యేకత. ప్రార్థనా మందిరాలన్నీ ఇలా ఉంటే ఎంత  బాగుండు!

            ప్రతిరోజూ ఒక గంట తమ కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం తమకిష్టమొచ్చిన రంగాలలో తమ శక్తి మేరకు పని చెయ్యటం అవసరం అని నేను భావిస్తున్నానుఅని చెప్పాను. అతి త్వరలో ఒక activity మొదలు పెట్టి వచ్చే సంవత్సరం గుంటూరు గాంధీ గారి సంస్మరణను ఆ రకంగా జరుపుకుంటే బాగుంటుందని, గుంటూరు గాంధీ గారి Extended Family లో మా స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలను చేర్చుకున్నందుకు సంతోషిస్తున్నామనిచెప్పాను.

            ‘నార్ల వెంకటేశ్వర రావుగారి సాహిత్య సర్వస్వముసంపుటిని బహుమతిగా ఇచ్చారు.

            పెద్దల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవటానికి అవకాశం కల్పించిన ఈ గుంటూరు యాత్ర స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలందరికీ ఒక మధుర స్మృతి. ఇందుకు ముఖ్య కారకులైన దాసరి హనుమంతరావు గారు, అయ్యన్ రావు గార్లకు ధన్యవాదములు.

- ప్రాతూరి శాస్త్రి

07.10.2020.