ప్రాతూరి శాస్త్రి - 02.11.2020.....           02-Nov-2020

 ఎందుకీ కష్టం కార్యకర్తలకు:

                ....

మే 3 వ తేదీ 2020 ఉదయం స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల శ్రమదానాన్ని చూసిన తరువాత నాలో కలిగిన భావాలను అక్షరబద్ధం చేశాను. ప్రతిరోజూ నాకు ఎంతో స్ఫూర్తినిచ్చే ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తల గురించి మరొక్కసారి ఆ భావాలను పంచుకుంటున్నాను.

ఎందుకీ కష్టం వీరందరికి?

 సమయం వేకువజాము – 5 గంటలు. గజగజ లాడించే చలి, మంచు! చల్లపల్లికి  1 ½ కిలోమీటర్ల దూరంలో నాగాయలంక రోడ్డు మీద కొన్ని కార్లు, బైకులు, సైకిళ్ళు ఒక్కొక్కటిగా వచ్చి ఆగుతున్నాయి. దిగుతున్న వాళ్ళలో లక్షాదికారులు, కోటీశ్వరులు, సమాజంలో గౌరవస్థానంలో ఉన్న డాక్టర్లు, లాయర్లు, విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చేతి వృత్తుల వారు, మొన్నమొన్నటి దాక ఇళ్ళకే పరిమితమైన గృహిణులు. వెరసి ఓ 45 మంది చకచకా చేతులకు తొడుగులు, సుశిక్షితులైన గని కార్మికుల్లాగా   తలకు లైట్లు పెట్టుకుని, కత్తో, గొడ్డలో, కొడవలో, గొర్రో, చీపురో తీసుకున్నారు. కొందరు పిచ్చిమొక్కలు నరుకుతుంటే, గొర్రులతో వాటిని గుట్టలు పెట్టేవారు ఇంకొందరు. గోకుడు పారలతో మట్టిని చెక్కి రహదారి అందానికి మెరుగులు దిద్దే పని కొందరిది. ఆ చోటొక పబ్లిక్ పాయిఖానా. ఐనా ఎవరూ వెనక్కి తగ్గరే!! 100 గజాల మేర ఆ రోడ్డును, దానిప్రక్కలా అద్దంలా తయారు చేసి, అప్పుడే వస్తున్న కర్మసాక్షి (సూర్యుడి)తో బాటు తాము కూడా దాన్ని చూసుకుని మురిసిపోతున్నారు.

       “శ్రమైక జీవన సౌందర్యానికి

        సమానమైనది లేనే లేదని” - శ్రీ  శ్రీ

ఋజువు చేస్తున్నారు. ఆ స్వచ్ఛ కార్మికుల కఠోర శ్రమకు మరొక నిదర్శనం ఆ చలిలో గాని, ఎండలో గాని వారు తాగిన 25 లీటర్ల నీళ్ళే! ఆ ఉషోదయాన వారు వింటున్నవి శ్రమ విలువను, సమిష్టితత్వాన్ని, దేశభక్తిని, సామాజిక బాధ్యతను కీర్తించే పాటలే. వీరి హాజరు పైన, పని పైన పర్యవేక్షకులు లేరు. రాకున్నా, వచ్చి పని చేయకున్నా ఎవ్వరూ అడగరు.

వీరింత వరకు చేసిన సేవాబాధ్యతకు ఏ ప్రతిఫలం ఇవ్వరు. మరి ఇంత నిష్టగా చెమటోడ్చేదెందుకు? 6-30 గంటల సమయానికి పని నిలుపుదలకై విజిల్ మ్రోగినా మరొక 15-20 నిమిషాల పాటు తమ ఎదుట మిగిలిన పని సంతృప్తికరంగా ముగించి గాని నడుములెత్తరు. అప్పుడు గాని తమ స్వచ్ఛంద శ్రమను ఆపి కాఫీ త్రాగరు.

 ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగిన ఈ రెండు గంటల కార్యక్రమంలో ఆ 45 మంది ముఖాలలో ఎనలేని సంతోషం. అసాధ్యమని ఎందరో హెచ్చరిస్తున్న స్వప్నాన్ని నిజం చేస్తున్న విజయ దరహాసం. రేపటి  శుభ్ర , స్వచ్ఛ కృషి కూడా ఇదే చోటని నిర్ణయించుకుని గృహోన్ముఖులవుతారు.

ఇంత కష్టపడటం ఎందుకు?

2000 రోజుల నుండీ చలి, ఎండ, మంచు, ఉక్కపోత ఏవీ లెక్క చేయక 20 నుండీ 78 ఏళ్ల వయసున్న వీరంతా ఏ స్వార్ధంతో ఇలా శ్రమిస్తున్నారు? తమ వారి కోసం కష్టపడటం ఎవరికైనా సహజమే. తమ కుటుంబం కోసం శ్రమించడం ఎక్కడైనా చూసేదే!

 కాని ఇంతగా చెమటలు చిందిస్తూ, పరుల కోసం-ఊరి కోసం-సమాజం కోసం-ఆనందంగా శ్రమించడం ఇక్కడ మాత్రమే చూడగలం.

 పదిమందితో కలిసి పదివేల మంది ఆరోగ్యం కోసం, ఆనందం కోసం పాటుబడడంలో నిజంగా ఏదో పెద్ద సంతోషమే ఉండి ఉండాలి.

చాలా కాలం నడక సంఘ మిత్రులు రాజేంద్రప్రసాద్ గారి బృందం నెలలో 2, 4 ఆదివారాలు కార్యకర్తలతో కలసి సేవాబాధ్యత వహించడం ఆనందదాయకం.

స్వచ్ఛ సుందర చల్లపల్లి కోసం కంకణం కట్టుకున్న ఈ వీరులు ప్రతి రోజూ అమూల్యమైన తమ 2 గంటల సమయాన్ని, లక్ష్యసాధనలో సమర్పించడం చూస్తుంటే రెండు తరాల నాటి జాతీయోద్యమం గుర్తుకు రావటం లేదా?

 2000 రోజులుగా నా గ్రామస్తులకూ, నాకూ తరగని స్ఫూర్తి నింపుతూ స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమాన్ని సైనిక క్రమశిక్షణతో నిర్వహిస్తున్న ఈ కర్మవీరులందరికీ

                        సలామ్!    సలామ్!!       సలామ్!!!

- దాసరి రామకృష్ణ ప్రసాదు

 

దారులన్నీ మురిశాయి అందమైన తరులతో

మనసులు కలిశాయి సేవాసాగరంలో

వెన్నెలలా మెరిసింది శ్రమసంస్కృతి జీవంతో

మా తల్లీ చల్లపల్లీ

We love you forever.

 

సంభాషణలు మనోహరంగా నిశ్శబ్ద తరంగాలుగా

చూపరులకు అందమైన భావాల లోగిలిగా,

పాత్రికేయుల ఆలోచనలకు అక్షరాకృతి నివ్వగా,

మా తల్లీ చల్లపల్లీ

We love you forever.

 

ఋతువులు లెక్కసేయక ఇచ్చిన

 కార్యకర్తల భౌతికానందం,

సుందరబృంద మోహన చిత్రకళా సౌందర్యం,

పాలనురుగుల రాయంచల కలల సౌకుమార్యం,

మది పరవసించే సమ్మోహన సంగీతం,

మా తల్లీ చల్లపల్లీ

We love you forever.

 

- ప్రాతూరి శాస్త్రి

02.11.2020.