రాయపాటి రాధాకృష్ణ - 19....           03-Nov-2024

 దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 19

70 ఏళ్ల జీవితంలో - మరపురాని అనుభవం!

            డెప్యూటీ తహసీల్దారుగా విరమించిన రెవిన్యూ ఉద్యోగంలో గాని - S.R.Y.S.P లో విద్యార్ధి దశలో గాని – అందర్లాగే నాకున్నూ, చాలా ఉన్నా, గత పదేళ్ల స్వచ్చంద శ్రమదాన సమయపు అనుభవాలే చప్పున గుర్తొస్తాయి!

            ఈ చల్లపల్లిలో పుట్టి - పెరిగి – చదివి - ఉద్యోగించి, 12 ఏళ్లుగా విశ్రాంత జీవితం గడుపుతున్న రాయపాటి రాధాకృష్ణ - తన గ్రామం మేలు కోరి నిర్విరామంగా జరుగుతున్న స్వచ్ఛ – శుభ్ర – సుందరీకరణ శ్రమదానానికి దూరంగా ఎన్నాళ్లుండగలడు?

            సత్యసాయి ధ్యాన మండలిలో ఈ వేకువ శ్రమదాన చర్చ వచ్చినపుడు - మోహనరావు, సజ్జా ప్రసాదు, BSNL నరసింహారావులతో పాటు ఒక మంచి ముహుర్తాన శ్రమదానంలో అడుగు పెట్టాను.

నాలాంటి ఒకానొక బ్రహ్మ వంశ సంజాతుడు –

1) శ్మశానంలో చీకట్లో – కుళ్ళుతున్న జంతు కళేబరాల మధ్య – ఎముకలు - పుర్రెల సరసన పనిచేసిన -

2) 1 వ వార్డులో హాస్టల్ దగ్గర అంత పెద్ద రోడ్డూ పిచ్చి - ముళ్ల చెట్ల కంపల్తో మూసుకుపోయి, కాలిబాటగా మిగిలిన చోట – నరకప్రాయమైన మార్గాన్ని నందనంగా మార్చిన కార్యకర్తల్తో చేతులు కలిపిన –

అనుభవాలు మరువ గలిగినవా?

            మా జంట ఏ రోజు ఇతర కార్యకర్తలతో కలిసి పనిచేసినా – అప్పుడప్పుడూ ఉడతా భక్తిగా ఆర్థిక సహకార మందించినా - పొందిన సంతృప్తి మాటలతో కొలువగలిగినదా?

            నా జన్మస్థలం ఈ 10 ఏళ్ళలో పొందిన మార్పులూ, దేశవ్యాప్తంగా పొందిన గుర్తింపూ గుర్తు చేసుకోంటే కలిగే ఆనంద తక్కువదా?

            పట్టితే ఇంకో పదేళ్ళు పట్టనీయండి – ఈ ఊరు అక్షరాలా స్వచ్ఛ – హరిత - సుందర – ఆనంద చల్లపల్లిగా మారితే చాలు – అంతవరకూ  మనం శ్రమదానం చేస్తూనే ఉందాం!

- రాయపాటి రాధాకృష్ణ

  31.10.2024.