గోళ్ళ వేంకటరత్నం....           25-May-2020

 2000 దినాల స్వచ్చోద్యమ చల్లపల్లి సేవా తరంగాలు -

కార్యకర్తల స్వానుభవ జ్ఞాపకాల పరంపర – 22

నా కలల ఆరోగ్య ఆనంద సీమ స్వచ్చ సుందర చల్లపల్లి.

            స్వచ్చ చల్లపల్లి ప్రణాళికా రచయితలకు – 2000 దినాలుగా విసుగు చెందని విక్రమార్కుల్లా గ్రామ మెరుగుదలకై శ్రమిస్తున్న కార్యకర్తలకు ధన్యవాదాలు. మన పూజ్య బాపూజీ స్వప్న సుందర దృశ్యం స్వయం సమృద్ధ – స్వచ్చ – శుభ్ర – గ్రామీణ భారతం! ఏడెనిమిది దశాబ్దాల తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మేరకు పిలుపునిచ్చి మరచిపోవడం కూడ జరుగుతున్నప్పుడు - మా చల్లపల్లి లో మొలకెత్తి, శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న ఈ స్వచ్చోద్యమం నాకు చాల అభిమాన పాత్రం.

            డాక్టర్. డి.ఆర్.కె. ప్రసాదు గారు, జనవిజ్ఞానవేదిక వారి ఆలోచన మొదలుపెట్టిన చల్లపల్లి స్వచ్చోద్యమం 50 రోజులు – 100 రోజులు దాటుతున్నప్పుడు – గత 14 ఏళ్లుగా నియమ నిష్ఠలతో సత్సంగాలు చేస్తున్న మా ధ్యాన మండలి బృందం అనివార్యంగా ఈ శుభోదయ శ్రమదాన ఉద్యమంలోకి వచ్చేసింది. అప్పటి మా ధ్యాన మండలి అధ్యక్షులు ఉడత్తు రామారావు గారు, నాగభూషణం గారు, సామ్రాజ్యం గారు, సజ్జా ప్రసాదు గారు, బొమ్మిశెట్టి ఆత్మపరబ్రహ్మం గారు, BSNL నరసింహారావు గారు, గంధం వేంకటేశ్వరరావు గారు నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు స్వచ్చోద్యమ కార్యకర్తలుగా మారిపోయారు.  

- ముందు వారానికొకరోజని, రెండు రోజులని – ఇక ఇప్పుడు ఎక్కువ మందిమి వారంలో అన్ని రోజులూ చిత్తశుద్ధితో పాల్గొంటున్నాం! స్వచ్చోద్యమ పూర్వాపరాలను వివరిస్తూచాల సమావేశాల్లో డాక్టర్ గారు ధ్యాన మండలి సభ్యుల నిబద్ధతను ప్రస్తావిస్తుంటారు.

            ప్రొద్దున్నే 40 – 50 మంది శ్రమదాతలను కలిసి, కుశల ప్రశ్నలు వేసుకొని, సొంతానికి కాక – గ్రామం కోసం కలిసి పనిచేసే మహత్తర కార్యక్రమం - ఇది నన్నాకర్షించడంలో వింత లేదు గాని స్వార్ధం, అవినీతి, అవకాశవాదం పరాకాష్టకు చేరుతున్న సమాజానికి మాత్రం ఒక పట్టాన మ్రింగుడు పడనిదే! నమ్మశక్యం కానిదే – అందుకే ఎక్కడెక్కడి నుండో – ఎందరెందరో స్వయంగా వచ్చి – ప్రత్యక్షంగా చూసి గాని నమ్మరు! నమ్మిన వాళ్లేమో నెత్తిన బెట్టుకొంటారు!

            నాకు అభిమాన పాత్రమైన ఈ స్వచ్చ కార్యక్రమంలో – హుండీ వసూళ్ళు, పుట్టిన – వివాహ సందర్భాల చందాలు వంటివి కూడ నేను ప్రతిపాదించినవే, నాకు నేను ఈ ఉద్యమం పట్ల స్పందించడం నా విధిగా భావించి, తెలిసిన మరి కొందరు మిత్రుల్ని కూడ దీనిలోకి తెచ్చాను. మా అన్నదమ్ములు, కుటుంబాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ ఉద్యమ సంబంధీకులే! నా మనుమడు సైతం దీనిలో పాత్రధారే!

            మిత్రులారా! కరోనాలే అడ్డు పడలేని – ఆపలేని శక్తివంతమైన – నమ్మశక్యం కాని స్వచ్చ సుందర యజ్ఞం ఇది. దీన్నిలా – మన మందకొడి సమాజానికి ప్రేరకంగా అవసరమైనంత కాలం నిర్వహిస్తూనే ఉందాం.

- గోళ్ళ వేంకటరత్నం,

స్వచ్చ – సుందర కార్యకర్త, వాసవీ నగర్ – 20.05.2020.