పల్నాటి అన్నపూర్ణమ్మ - 18.11.2023....           18-Nov-2023

ఉద్యమంలో పాల్గొనకముందూ – తర్వాతా

అందరికీ నమస్కారాలు తండ్రీ! 10 నెలలుగా ఊరి శ్రమదానానికి దూరంగా ఉండడం ఎంత కష్టమో తెలుసుకొన్న పల్నాటి అన్నపూర్ణనండి! యాక్సిడెంట్ లో కాలు నుజ్జై, బహుళ శస్త్రచికిత్సలు జరిగి, నెలల తరబడి ఫిజియోథెరపీల తర్వాత గత నాలుగు రోజుల నుండీ మన స్వచ్చోద్యమ ప్రపంచంలోకి నా కాలు మోపుతున్నందుకు ఆనందంగా ఉన్నది.

ఇన్నాళ్లుగా నన్ను పరామర్శిస్తూ మానసికంగా అండగా నిలుస్తూ - ఒక సోదరిగా కనిపెట్టుకొచ్చిన మీకూ, మన డాక్టర్లిద్దరికీ ధన్యవాదాలు. మరీ ఈ నాలుగైదు రోజుల్నుండైతే ప్రతి కార్యకర్తా “జాగ్రత్తమ్మా! ఇక్కడి దాకా నువ్వు వచ్చిందే చాలు, ఎక్కువగా పనిచేయొద్దు, ఎప్పుడు కాలు నొప్పెట్టితే అప్పుడు కూర్చో...... అంటూ హెచ్చరించడం చూస్తే – అందర్లాగా పని చేయలేకపోతున్నందుకు బాధగా ఉన్నది తండ్రీ!

ఇంతమంది అన్నయ్యలూ, తమ్ముళ్ళూ, వదినలూ తోడుంటే అంత కన్నా ఏం కావాలి - నా కాలు పూర్తిగా నయం కావడానికి!

ఇంట్లో కూర్చున్న ఇన్ని నెలలూ ప్రతిరోజూ వాట్సప్ లో మీ శ్రమదానం చూస్తూనే ఉన్నాను. 12 వ తేదీన ఇక ఆగలేక – ధైర్యం చేసి, తొమ్మిదేళ్ల ఉత్సవానికి వచ్చాను. నా ధైర్యం ఊరికే పోలేదు – ఆ నాలుగ్గంటలూ ఎంత సంతోషించానో!

అసలింత మందిమి - ఇన్ని వేల రోజులు ఊరి కోసం శ్రమించడమూ, ఇందులో కొందరం ఉడతా భక్తిగా ఉద్యమ ఖర్చుల కోసం ఆర్థికంగా కూడా సహకరించడమూ, ఈ వింత కార్యక్రమాన్ని ఎక్కడెక్కడి సంస్థలో గుర్తించి, అవార్డులిచ్చేందుకు పిలవడమూ, ఈ 40-50 మంది యూనిఫాంలో వెళ్లిరావడమూ - ఇంట్లో కూర్చొని గుర్తుచేసుకొంటుంటే నమ్మశక్యం కావడం లేదు!

నా జీవితాన్ని రెండు భాగాలు చేసి చూసుకొంటే - స్వచ్చోద్యమంలో పాల్గొనకముందూ - తర్వాతా అన్నట్లుగా ఉన్నది తండ్రుల్లారా!

అన్నిటికన్నా విశేషమేమంటే – ఈ కార్యకర్తల్లో ఏ ఒక్కరూ “నేను నా ఊరినుద్ధరిస్తున్నాను” అనుకోక. “నా కర్తవ్యం నేరవేరుస్తున్నాను” అనుకోవడమే!

అందుకే నాకు దేవుడి దయ ఉన్నంత వరకూ ఈ శ్రమదానం మాననే మానను!

- పల్నాటి అన్నపూర్ణ

   17-11-2023.